ఒక్క అమెరికాలోనే సుమారు నాలుగు లక్షల మంది కరోనా బాధితులు ఉన్నారు. సుమారు 13వేల మరణాలు సంభవించాయి. ఆస్పత్రుల నిండా బాధితులే కనిపిస్తున్నారు. ట్రక్కుల నిండా శవాల గుట్టలే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మున్ముందు ఈ సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం ఉందనే వార్తలు వస్తున్నాయి. స్పెయిన్‌లో సుమారు 14వేల మందికిపైగా, ఇటలీలో 17వేల మందికిపైగా కరోనాతో మృతి చెందారు. ఆ తర్వాత ఇరాన్, ఫ్రాన్స్, చైనాతోపాటు మరికొన్ని దేశాల్లో బాధితులు, మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇక భారత్‌లో ఇప్పటివరకు 5311 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 150 మంది మరణించారు. 353మంది కోలుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రోజురోజుకూ కరోనా వైరస్ ప్రభావం తీవ్రమవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను ఎత్తేసే అవకాశాలు కనిపించడం లేదుని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, సామాజిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.
ప్రపంచాన్ని కరోనా వైరస్ కుదిపేస్తోంది. దేశాలన్నీ కూడా అతలాకుతలం అవుతున్నాయి. అగ్రరాజ్యాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. వేగంగా వ్యాప్తి వైరస్ కట్టడికి ఏం చేయాలో తెలియక.. దిక్కుతెలియని, దారితోచని స్థితిలో పడిపోతున్నాయి. ఇక ఈ ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరించే అమెరికాలో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. ఎటుచూసినా శవాల గుట్టలే కనిపిస్తున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఆస్పత్రుల నిండా బాధితులే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కరోనా మరణాల సంఖ్య ఏకంగా లక్షకు చేరువలో ఉంది. ఇప్పటివరకు సుమారు 82వేల మందికిపైగా కరోనా వైరస్‌తో మృతి చెందారు. సుమారు 15లక్షల మందికిపైగా వైరస్‌బారిన పడ్డారు. మూడు లక్షల మందికిపైగా కరోనా బారినుంచి కోలుకున్నారు. ఈ గణాంకాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మున్ముందు ఈవైరస్ ఇంకెంత మందిని బలితీసుకుంటుందోనని వణికిపోతున్నారు. ఇక కరోనా సామాన్యుల నుంచి మొదలుకుని దేశాధినేతలను కూడా వదలడం లేదు. ఇప్పటికే పలువురుప్రముఖులు కరోనాతో మృతి చెందగా మరికొందరు చికిత్స పొందుతున్నారు.