ప్రపంచాన్ని శాసించే పెద్దన్న... ఇప్పుడు కరోనా చేతికి చిక్కివిలవిల్లాడుతున్నాడు. వందలు కాదు... వేలు కాదు... సుమారు 5 లక్షల మంది అమెరికన్లు కరోనా బారిన పడ్డారు. ఇంత వరకూ 17 వేల మంది వరకూ చనిపోయారు. గడిచిన 24 గంటల్లోనే దాదాపు 30 వేల కొత్త కేసులు, సుమారు 2 వేల మరణాలు నమోదయ్యాయి.
అమెరికాఅభివృద్ధి చెందిన దేశమే కాదు... వైద్య సౌకర్యాల్లో మేటి. కానీ... అక్కడ కరోనా సోకిన వాళ్లలో కోలుకున్నది కేవలం పాతి వేల మందే. 4 లక్షల 20 వేల మందికి పైగా ఇంకా చికిత్స పొందుతున్నారు. వీళ్లలో దాదాపు పది వేల మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
న్యూయార్క్‌లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఇంత వరకూ అక్కడ లక్షా 60 వేల మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. ఇందులో దాదాపు 10 వేలు కొత్త కేసులున్నాయి. న్యూయార్క్‌లో కరోనాతో ఇంత వరకూ 7 వేల మందికి పైగా చనిపోగా, దాదాపు 800కు పైగా మరణాలు గత 24 గంటల్లోనే సంభవించాయి.
న్యూజెర్సీలో 50 వేల మందికి పైగా కరోనా బారిన పడగా, అందులో 3 వేల 600 వరకూ కొత్త కేసులు. అలాగే, న్యూజెర్సీలో ఇంత వరకూ 17వందల మంది చనిపోగా, అందులో 200 వరకూ తాజా మరణాలు.
మిచిగాన్‌లో 1200, లౌసియానాలో 1300, పెన్సిల్వేనియాలో 1500, ఇల్లినాయిస్ 1400, కనెక్టికట్‌లో వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మిచిగాన్‌లో 120 మందికి పైగా చనిపోగా, ఇల్లినాయిస్‌లో 70, లౌసియానాలో 50, కనెక్టికట్‌లో 45, పెన్సిల్వేనియాలో పాతిక మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
ఫ్లోరిడాలో దాదాపు 660కి పైగా కరోనా కొత్త కేసులు నమోదు కాగా, 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇండియానా, వర్జీనియాల్లో తాజాగా చెరో 400 మందికి పైగా కేసులు, 50కి పైగా మరణాలు నమోదయ్యాయి. మేరీల్యాండ్‌లో కొత్తగా 650 మందికి పైగా మంది కరోనా బారిన పడినా... అక్కడ తాజా మరణాలు 15 వరకూ ఉన్నాయి.
కరోనాను కట్టడి చేయడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది అమెరికా. కరోనా సోకిన వాళ్లను ముందుగానే గుర్తించేందుకు పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తోంది. ఇంత వరకూ 23 లక్షల మందికి పైగా అనుమానితుల నమూనాలను పరీక్షించింది అమెరికా. కానీ... కరోనా వ్యాప్తిని అడ్డుకోలేకపోతోంది అగ్రరాజ్యం.