కరోనా వైరస్‌ను చైనా వైరస్ అని, వూహాన్ వైరస్ అని అమెరికాప్రస్తావించడం, దీనిీపై చైనా ఆగ్రహం వ్యక్తం చేయడం చాలారోజులుగా జరుగుతూనే ఉంది. వైరస్ మొదటగా చైనాలో బయటపడిందని, చైనా గనుక సత్వరం స్పందిస్తే ప్రపంచం పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదనే ధోరణిలో అమెరికామాట్లాడుతున్నది. ఇది చైనాకు ఏమాత్రం రుచించే విషయం కాదు. అయినప్పటికీ... ఐక్యరాజ్య సమితి భద్రతామండలి సమావేశంలో అమెరికాప్రతినిధి కెల్లీ క్రాఫ్ట్ మాట్లాడుతూ వైరస్ మూలం, లక్షణాలు, వ్యాప్తిపై శాస్త్రీయపరమైన డేటా సేకరణ, విశ్లేషణ జరగాలని పిలుపునిచ్చారు. ఈ విధానాలకు ఎంత ప్రాముఖ్యమున్నదో నొక్కిచెప్పాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. వైరస్ మూలం అనే మాటలు చైనాను ఉద్దేశించి చేసినవేనని అర్థం అవుతూనే ఉంది.
మరోవైపు, వైట్ హౌస్‌లో మీడియాసమావేశం సాక్షిగా అమెరికాఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్మరోసారి చైనాపై నిప్పులు కక్కారు. అమెరికాసాయంతో డబ్ల్యూటీవోలో చేరిన తర్వాతనే చైనా ఆర్థికవ్యవస్థ పుంజుకోవడం మొదలైందని అన్నారు. ఏళ్ల తరబడి ఎదుగూబొదుగూ లేకుండా ఉన్న చైనా ఆర్థికవ్యవస్థ డబ్ల్యూటీవోలో చేరిన తర్వాతే ఒక్కసారిగా రాకెట్‌లా పైకి లేచిందని ట్రంప్వివరించారు. అందుకు అందరినీ వాడుకున్నారని దుయ్యబట్టారు. చైనా అభివృద్ధి చెందుతున్న దేశమైతే అమెరికాను కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగానే పరిగణించాలని అంటున్నారు. అమెరికాను అడ్డుపెట్టుకుని ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరిన చైనా ఎంతో లబ్ధి పొందిందని అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశమనే సాకుతో బోలెడు ప్రయోజనాలు పొందుతున్నాయని ట్రంప్విసుక్కున్నారు.