ఈ కరోనా పేషెంట్ ఆస్పత్రి నుంచి పరారయ్యేందుకు సినిమాటెక్నిక్ వాడేశాడు. చీరలను తాడులా కట్టి...ఇంటి కిటికీ లేదా బాల్కనీలో కట్టి కిందికి జారి పరారయ్యే సీన్ చాలా సినిమాల్లోనే చూసుంటాం. సినిమాల్లో హీరోయిన్లను వాళ్ల ఇంటి నుంచి తప్పించి తీసుకెళ్లడానికి వాడే ఈ టెక్నిక్‌ను ఈ కరోనా వ్యాధిగ్రస్తుడు ఉపయోగించాడు. 60 ఏళ్ల వృద్ధుడికి చీరలు ఎక్కడివి? అని ఆశ్చర్యపోకండి! ఆస్పత్రిలోని బెడ్ షీట్లు, తన దుస్తులను కలిపి తాడులా చేశాడు. చికిత్స అందిస్తున్న గదిలోని కిటికీ అద్దాన్ని పగులకొట్టి..... తను తయారు చేసుకున్న తాడుతో వేలాడదీసి కిందకి జారి పరారయ్యాడు. తీరా ఆయనకు చికిత్స అందించేందుకు వచ్చి చూసే వరకు సదరు ముసలోడు జంప్ అయిన సంగతి తెలిసిందే.
దీంతో, పోలీసులకు ఆస్పత్రి వర్గాలు ఫిర్యాదు చేశాయి. కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్ తప్పించుకోవడం, అతడు బయట ఎక్కడైనా జనంలో తిరిగితే వైరస్ వ్యాపించే ప్రమాదం ఉండడంతో అప్రమత్తమై పోలీసులు రంగంలోకి దిగి గాలించింది. మొత్తం గ్రామాలు జల్లెడ పడుతున్న తరుణంలో హాస్పిటల్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో అతడిని గుర్తించి, మళ్లీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి నుంచి తప్పించుకుని పారిపోవడంతో ఇప్పుడు అతడిని కిటికీలు ఏవీ లేని గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరోనా పాజిటివ్ అని తేలడంతో 17 మంది నేపాలీలతో కలిసి అతడిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నామని, ఇలా తేడాగా ప్రవర్తిస్తాడని ఊహించలేదని ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆర్కే టాండన్ తెలిపారు.
]]>