ఏపీలో చాలా చోట్ల మద్యం అక్రమంగా రవాణా అవుతోంది. లాక్ డౌన్ సమయంలో మద్యం దుకాణాలు మూసేయాలని ప్రభుత్వం కచ్చితంగా చెప్పినా.. పట్టించుకోకుండా కొందరు అధికారులు అక్రమ రవాణాకు తెరలేపినట్టు సమాచారం. కొందరు ఎక్సైజ్ సిబ్బంది, అధికారుల జోక్యంతోనే ఏపీలో మద్యం అక్రమంగా రవాణా అవుతోంది. గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం సాగిపోతోంది. ఈ క్రమంలో ఏపీసర్కార్ మద్యం అక్రమ రవాణాపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు కొందరిపై చర్యలకు ఉపక్రమించనున్నట్టు తెలుస్తోంది.
కరోనా భయాందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వఆదేశాలకు అనుగుణంగా ఏపీలో లాక్ డౌన్ అమలవుతోంది. అన్ని దుకాణాలతో పాటు మద్యం దుకాణాలు కూడా బంద్ అయ్యాయి . దీంతో మందుబాబులు తమకు అత్యంత కష్ట కాలం వచ్చిందని భావిస్తున్నారు. అయితే మందుబాబుల వీక్ నెస్ ను క్యాష్ చేసుకునేందుకు కొందరు అక్రమంగా మద్యం సరఫరా చేస్తుంటే.. వారికి ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో కొందరు ఎక్సైజ్ శాఖ సిబ్బంది.. అధికారులు సహకరిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో జరుగుతున్న మద్యం అక్రమ రవాణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.
ఏయే జిల్లాల్లో మద్యం అక్రమ సరఫరాకు అధికారులు.. సిబ్బంది సహకరిస్తున్నారనే అంశంలో సమాచారాన్ని సేకరిస్తోంది ప్రభుత్వం. కొన్ని జిల్లాల్లో సీఐ స్థాయి ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్టు ఆధారాలు కూడా సేకరించింది. అలాగే కొన్ని చోట్ల ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉందని తెలుస్తోంది. తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు వంటి జిల్లాల్లో కొందరు సీఐ స్థాయి ఉద్యోగులే అక్రమాలకు పాల్పడినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని తెలుస్తోంది. ఇప్పటికే తూర్పు గోదావరిజిల్లాలోని ఓ ఎక్సైజ్ సీఐను సస్పెండ్ చేశారు. గుంటూరు జిల్లాచిలకలూరి పేటలో ఎమ్మెల్యేవిడదల రజనిస్వయంగా ఎక్సైజ్ శాఖ సిబ్బంది చేతి వాటాన్ని బయట పెట్టారు. ఈ ఘటనలో ఓ హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు.
లాక్ డౌన్ సమయంలో మద్యం సరఫరా ఎక్కువగా బార్ల ద్వారా జరుగుతోందని ప్రభుత్వానికి వచ్చిన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వివిధ జిల్లాల్లో అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న సుమారు 20 బార్లను ప్రభుత్వం గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ బార్ల వెనుక ఎక్సైజ్ శాఖ అధికారులెవరైనా ఉన్నారా..? అనే కోణంలో కూడా సర్కార్ ఆరా తీస్తోంది. అలాగే కొన్ని ప్రభుత్వ రిటైల్ షాపుల్లో కూడా గుట్టు చప్పుడు కాకుండా మద్యం అక్రమ సరఫరా జరుగుతోందనే సమాచారం కూడా ప్రభుత్వం వద్ద ఉంది.
ఎక్సైజ్ సిబ్బంది, ఉద్యోగుల్లో కొందరు మద్యం బాటిళ్ల సీళ్లను మారుస్తున్నారని ప్రభుత్వ పెద్దల దృష్టికి వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో బార్లు.. ప్రభుత్వ రిటైల్ దుకాణాల్లో స్టాక్ వెరిఫికేషన్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మద్యం షాపులు మూతపడిన నాటికి.. ఇప్పటికి స్టాక్ వెరిఫై చేయాలని సూచించింది. ఈ క్రమంలో లెక్కల్లో ఏమైనా తేడాలు వస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతే బార్ల లైసెన్సులు కూడా రద్దు చేసే దిశగా నిర్ణయం తీసుకునే సూచనలు కన్పిస్తున్నాయి.
ఇక సరిహద్దు చెక్పోస్టుల్లో కూడా నిఘా పటిష్టంగా ఉండాలని ఏపీసర్కారు ఆదేశాలు జారీ చేసింది. పొరుగు రాష్ట్రాల బోర్డర్ల ద్వారా కొందరు మద్యం అక్రమంగా తెచ్చుకుంటున్న కేసులు కూడా ప్రభుత్వం దృష్టికి రావడంతో సర్కార్ ఈ దిశగా కూడా కట్టుదిట్టమైన నిఘా పెట్టింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక కొందరు సిబ్బంది, అధికారుల చేతి వాటంతో పాటు, సరైన పర్యవేక్షణ లేకపోవడం కూడా ఓ కారణంగా కన్పిస్తోంది. వివిధ జిల్లాల్లో ఎక్సైజ్ శాఖ డీసీలు.. ఏసీలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో మద్యం అక్రమ సరఫరా కట్టడి కష్టమవుతోందనే వాదన వినిపిస్తోంది. విజయవాడ, శ్రీకాకుళం, అనంతపురం, గుంటూరు ప్రాంతాల్లో ఇన్ చార్జులతోనే నెట్టుకొస్తున్నారు. ఎక్సైజ్ శాఖలో జరిగే అక్రమాలను అరికట్టాలంటే పూర్తి స్థాయిలో నియామకాలు అవసరమనేది ఎక్సైజ్ శాఖ వర్గాల భావన.
]]>