ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో కృష్ణాజిల్లానాలుగో స్థానంలో ఉంది. కానీ నమోదైన పాజిటివ్ కేసులు అత్యధికంగా విజయవాడలోనే నమోదయ్యాయ్. ఇప్పటి వరకు జిల్లాలో 35 మందికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయ్. అందులో 27 కేసులు బెజవాడలోనే నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా తొలి మరణం కూడా బెజవాడ భవానీపురంలోనే నమోదైంది. భవానీపురంలోనే ఒక కుటుంబంలో ఏడుగురికి పాజిటివ్ వచ్చింది. దీంతో ఈ ప్రాంతం మొత్తం కర్ఫ్యూ విధిస్తూ అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. ఢిల్లీవెళ్ళి వచ్చిన యువకుడి తండ్రిచనిపోగా.. అతడి కుటుంబంలో అందరికీ కరోనా పాజటివ్ తేలింది.
విజయవాడలో ఎక్కువ కేసులకు ఢిల్లీలింకులున్నాయ్. ఢిల్లీవెళ్ళి వచ్చిన వారి ద్వారానే నగరంలో కరోనా కేసులు ఎక్కువగా పెరిగాయి. జమాత్‌కు వెళ్లి వచ్చిన వారు నగరంలో ఎక్కువ మందిని కలిశారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బెజవాడలో మొత్తం 27 మందికి కరోనా సోకితే.. అందులో 23 కేసులు ఢిల్లీవెళ్ళిన వారే..! దీంతో బెజవాడలో హై అలెర్ట్ ప్రకటించారు. ఇప్పటికి 23 కేసులు మాత్రమే ఢిల్లీలింకులతో కేసులు నమోదవగా ఇంకా 195 వరకు రిపోర్టులు రావాల్సి ఉంది. దీంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మరోవైపు లాక్ డౌన్ సమయాన్ని ఉదయం 6 నుంచి 9 గంటలకు కుదిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
బెజవాడలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అత్యధికంగా బెజవాడ పశ్చిమ నియోజక వర్గంలోనే 12 కేసులు నమోదయ్యాయి. ఇక సెంట్రల్ నియోజకవర్గంలో నాలుగు కేసులు, తూర్పు నియోజక వర్గంలో 7 కేసులు నమోదయ్యాయ్. దీంతో నగరంలో పలు ప్రాంతాల్ని రెడ్‌జోన్లుగా ప్రకటించారు అధికారులు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ పెట్టారు అధికారులు. ఆ ప్రాంతాల్లో కేవలం ఎమర్జెన్సీ వాహనాలకు మాత్రమే అనుమతినిస్తున్నారు. ఇక నిత్యావసర వస్తువులను కూడా ఇంటింటికి పంపించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.
]]>