200కు పైగా దేశాల్లో విలయం సృష్టిస్తోన్న కరోనా మహమ్మారి... 90 వేల మందికి పైగా బలితీసుకుంది. మొత్తం పాజిటివ్ పేషెంట్ల సంఖ్య 16 లక్షలు దాటింది. తీవ్రతను బట్టి వచ్చే మరణాల సంఖ్య 1లక్ష దాటే అవకాశం ఉంది. మారణ హోమమే కాదు.. ఆర్ధిక పరిస్ధితుల్నీ తారుమారు చేస్తోంది రాకాసి వైరస్. ఈ తరుణంలో ముందుముందు పరిస్ధితులు ఎలా ఉంటాయన్నదానిపై అంతర్జాతీయద్రవ్యనిధి సంస్ధ ఒక హెచ్చరిక చేసింది.
కరోనా నుంచి ప్రపంచం ఎప్పటికి బయటపడుతుందో ? ఒకవేళ బయటపడినా... ఆ విలయం తర్వాత తలెత్తే ఆర్థిక సంక్షోభం.. ఎలా ఉంటుందనే దానిపై .. అంతర్జాతీయద్రవ్య నిధి-ఐఎంఎఫ్ భయంకర వాస్తవాలు బయటపెట్టింది. 1930 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం కంటే దారుణంగా ఉంటుందని, రెండేళ్ల తర్వాత కూడా దాని ప్రభావం నుంచి కోలుకునే పరిస్థితి కనిపించదని తెలిపింది. గత వందేళ్ల కాలంలో ప్రపంచం ఎదుర్కొన్న సంక్షోభాలన్నిటిలోకి కొవిడ్-19 ప్రభావం అతి తీవ్రంగా ఉంటుదని చెప్పారు.
కరోనా కారణంగా 170 దేశాలకు ఆర్థిక మాంద్యం తప్పదని ఇదివరకే హెచ్చరించిన ఐఎంఎఫ్ .. 2020లోనే ప్రపంచ వృద్ధి రేటు నెగటివ్ లోకి వెళ్లిపోతుందని తెలిపింది. 180 ఐఎంఎఫ్ సభ్య దేశాల్లో ఏకంగా 170 దేశాల్లో తలసరి ఆదాయం పతన స్థాయికి క్షీణించడమే అందుకు నిదర్శనమి వివరించింది. వచ్చే వారం జరుగనున్న ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్సంయుక్త సమావేశాల నేపథ్యంలో ఐఎంఎఫ్ ఈ ప్రకటన చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ప్రభావం తగ్గినప్పటికీ.. ఆర్థిక వ్యవస్థ పతనాన్ని అరికట్టలేమని, వచ్చే ఏడాది నాటికి.. అది కూడా నెగటివ్ ప్రభావం నుంచి పాక్షికంగా మాత్రమే ఆర్థిక వ్యవస్థ కోలుకోవచ్చని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. ఈ ఏడాది చివరికిగానీ కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టబోదని, పరిస్థితి ఇంకాస్త దిగజారే అవకాశాలే కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. కొవిడ్ దెబ్బకు పేద, ధనిక దేశాలతోపాటు అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థలు కూడా ఒకే తీరుగా పతనమయ్యాయని వివరించారు.
నిజానికి ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 3.3గా ఉంటుందని, వచ్చే ఏడాది 3.4గా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనాలు వేసింది. కానీ కరోనా ఎఫెక్ట్ కు ప్రపంచ స్వరూపం మారినట్లే భావించాలని, వైరస్ ధాటికి ఎటు చూసినా తీవ్రమైన అనిశ్చితి కనిపిస్తోందని ఐఎంఎఫ్ చెబుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆయా ప్రభుత్వాలు.. తమ దేశాల్లోని కుటుంబాలకు, వ్యాపారాలు తిరిగి కోలుకునేదాకా పూర్తి స్థాయిలో అండగా నిలవడం ఒక్కటే పరిష్కారమార్గమని సూచించింది.