దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మరొకసారి పోడుగించే విధంగా అడుగులు పడుతున్నాయి. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఈ లాక్ డౌన్ కనీసం ఈ నెలాఖరి వరకు కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం కొనసాగుతున్న వేళ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లక్ష మరణాలు సంభవించడంతో పాటు ఇండియాలో కూడ కరోనా కేసులు నిన్నటికి 6,761 చేరడంతో ఈ విపత్తును ఎలా ఎదుర్కోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
ఇలాంటి పరిస్థితులలో ఈ సమస్య మరింత ముదిరిపోయి సామాజిక వ్యాప్తి వైపు అడుగులు వేస్తే పరిస్థితి ఏమిటి అన్న విషయం ఎవరికీ అర్ధం కాని సమస్యగా మారింది. ఇలాంటి పరిస్థితులలో కరోనా సమస్యల వల్ల ప్రజలలో పెరిగిపోతున్న డిప్రెషన్ పై ఒక ప్రముఖ అధ్యయన సంస్థ చెన్నైలోని కొన్ని కాలనీలలో చేసిన సర్వేలో అనేక ఆసక్తికర విషయాలు బయట పడ్డాయి అంటూ ఈరోజు ఒక ప్రముఖ దినపత్రిక ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.
ఈ సర్వేఅన్ని వయసులకు సంబంధించిన వారి పై నిర్వహించారు. ముఖ్యంగా ఇంటిలోని మహిళలు తమ జీవితభాగస్వాముల పై అదేవిధంగా తమ పిల్లల పై విపరీతమైన కోపాన్ని ప్రదర్శిస్తున్నారని మరికొందరైతే తమ ఇంటి ఎదురుగా ఉన్న వారి ఇంటి తలుపు తట్టి ఒక్కసారి మాట్లాడండి అంటూ అర్దిస్తున్నారని ఆ అధ్యయనంలో పేర్కొన బడింది.
అంతేకాదు మహిళలు పురుషులు 24 గంటలు ఇళ్ళల్లోనే ఉండటంతో గత విషయాలను తవ్వుకుంటూ ఇంట్లో గొడవలు కూడ తారా స్థాయికి చేరుకుంటున్నాయని ఆ అధ్యయనం పేర్కొంది. ముఖ్యంగా సున్నితంగా ఉండే వృద్దులు మహిళలు ఈ లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక బోర్ గా ఫీల్ అవుతూ డిప్రెషన్ లోకి వెళ్లిపోయి ఈ సమస్యను తట్టుకోలేక మానసిక వైద్యులను సంప్రదిస్తూ ఉంటే వారు ఆన్ లైన్ లో ఈ డిప్రెషన్ తో బాధపడుతున్న వారికి ఆన్ లైన్ లో సూచనలు ఇస్తున్నా ఆ సూచనలు వారి డిప్రెషన్ ను తీర్చడంలేదని ఆ అధ్యయనం తెలియచేసింది. ప్రస్తుతం చాలామంది ఎదుర్కుంటున్న కరోనా డిప్రెషన్ సమస్యలకు కొందరు మానసిక వైద్యులు చెపుతున్న సూచనల ప్రకారం పదేపదే మీడియాలో వస్తున్న కరోనా వార్తలు చూడవద్దని ఎదో ఒక పని చేస్తూ బిజీగా ఉండమని వ్యాయామం చేయమని ఆన్ లైన్ లో బంధువులు స్నేహితులతో సంభాషిస్తూ సరదాగా ఉండమని సరైన ఆహారం తీసుకుంటూ రాబోయే ఆర్ధిక సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉంటే ఈ డిప్రెషన్ సమస్యల నుండి బయటపడ వచ్చు అని ఆధ్యయనం తెలియచేస్తోంది..
]]>