కరోనా సోకిన వారిలో రోగ నిరోధక శక్తిచాలా కీలకం. రోగ నిరోధకశక్తి ఎంత పటిష్ఠంగా ఉంటే.. వైరస్ నుంచి బయటపడటం అంత సులువు. ఇప్పటి వరకూ వైద్య నిపుణులు ఈ మహమ్మారి చికిత్సలో భావిస్తోంది ఇదే. అయితే దక్షిణ కొరియాలో కోవిడ్ 19 సరికొత్తగా దాడి చేయడం ఇప్పుడు అందరినీ కలవర పరుస్తోంది. ఒకసారి వైరస్ సోకి... చికిత్స తర్వాత కోలుకున్న 91 మందిలో తిరిగి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు అక్కడి వైద్యులు గుర్తించారు. దీంతో ఈ మహమ్మారిని ఏ విధంగా అర్ధం చేసుకోవాలో అర్థంకాక నిపుణులు తలపట్టుకుంటున్నారు.
పాజిటివ్ రోగులకు చికిత్స తర్వాత కోలుకున్నారని సంబరపడటానికి లేదని తాజా ఘటనలు హెచ్చరిస్తున్నాయి. పరీక్షల్లో నెగిటివ్ వచ్చినా... బాధితుల శరీరంలో వైరస్ అలాగే ఉంటుందని తెలుసుకున్నారు. పైగా వైరస్ సుదీర్ఘ కాలం చైతన్యంగా ఉండటం వైద్యులను ఆందోళనకు గురిచేస్తోంది. అందుకే సౌత్‌కొరియాలో 91 మందికి మళ్లీ పాజిటివ్ వచ్చిందని అంటున్నారు.
కోవిడ్19 తీవ్రంగా దాడి చేసిన డేగు ప్రాంతంలోనే 91 మంది ఉదంతం బయటపడటంతో కొరియన్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ బృందాలను అత్యవసరంగా అక్కడికి పంపించారు. ఇక్కడ మరో ముఖ్య విషయం కూడా ఉంది. తిరిగి పాజిటివ్ వచ్చిన వారిలో ఎక్కడా కోవిడ్ లక్షణాలు కనిపించలేదు. ర్యాండమ్ టెస్ట్‌ల్లో భాగంగా ఈ విషయం వెలుగు చూడటంతో అంతా ఖంగుతిన్నారు.
ఒకసారి కోలుకున్న రోగులకు మళ్లీ వైరస్ వ్యాపించిందని అనుకోవడానికి లేదని అంటున్నారు. శరీరంలో వైరస్ ఉండటం వల్లే అది మళ్లీ చైతన్యమై ఉంటుందని సందేహిస్తున్నారు. అయితే ఆ 91 మందికి చికిత్స తర్వాత చేసిన పరీక్షల్లో తప్పుగా వైరస్ నెగిటివ్ అనే రిపోర్ట్ ఇచ్చి ఉండచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. వాస్తవానికి ఈ మహమ్మారి వ్యాపించిన సమయంలో ప్రపంచంలో అన్ని దేశాలకంటే వేగంగా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఔరా అనిపించింది దక్షిణ కొరియా. అందువల్ల ఆ దేశంలో మరణాల రేటు తక్కువగా ఉందని అనుకున్నారు. కానీ.. డేగులోని పరిస్థితిని చూసిన తర్వాత దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
]]>